శుక మహర్షి మరియు పరీక్షిత్తు జన్మ రహస్యం
భాగవతం మూడవ భాగములో వ్యాస మహర్షి కుమారుడైన శుక మహర్షి జన్మ రహస్యాన్ని, ఈ శుక మహర్షి భాగవతాన్ని చెప్పడానికి గల కారణమైన పరీక్షిత్తు మహారాజు జన్మ రహస్యాన్ని గురించి తెలుసుకుందాము.
నైమిశారణ్యంలో శవనకుడు అను ముని పన్నెండు ఏళ్లు జరుగు సత్రయాగం చేస్తూ వున్నాడు. అక్కడ వేలాదిగా మునులు యజ్ఞములో పాల్గొంటు ఉన్నారు. అటువంటి ప్రదేశంలో సూతుడు అను ఒక గొప్ప కధకుడు వారికి భగవంతుడి గురించి కథలను వినిపిస్తూ ఉన్నాడు. అక్కడి మునుల కోరికఫై భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ముందుగా భాగవతాన్ని మొట్ట మొదటిసారి భూమిపై చెప్పిన శ్రీ శుక మహర్షి జన్మ రహస్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో వ్యాస మహర్షి మేరు పర్వత శిఖరం పైకి వెళ్లి అక్కడ మహాశివుని కోసం ఘోర తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమనగా పంచభూతాలకు సమానమైన పుత్రుని ప్రసాదించమని అడిగెను. ఆయనకు ఆ వరం ప్రసాదిస్తాడు మహాశివుడు. తరువాత ఆయన ఒకరోజు యజ్ఞానికై నిప్పు రాజేస్తూ ఉండగా అక్కడకు దగ్గ్గరలో కృతాచి అను ఒక అప్సరస కనబడింది. ఆమె వయ్యారం, నాజుకుతనం, శారీరక వంపు సొంపులు ఆయనను ఆకర్షించాయి. ఆమె అందం అతనిలో కామాన్ని కలిగించింది. ఇది అంతా గమనించిన కృతాచి భయముతో ఈ ప్రాంతానికి వచ్చి ఈ విధముగా ఆయనకు కామ వికారాన్ని కలిగించాను అనుకుంది. ఇందుకు ఆయన నన్ను శపిస్తాడేమో అని భయపడింది. వెంటనే అద్భుత అందాల రాశిగా ఉన్న తన శరీరాన్ని చిలుకగా మార్చుకుంటుంది. కానీ ఆలోగానే వ్యాస మహర్షితో ప్రవేశించిన కామ వాంఛ వలన అతడి నుండి తేజస్సు వెలికి వచ్చేలా చేసింది. అయినా అలాగే నిప్పు రాజేయటానికి ప్రయత్నిస్తున్నాడు. దానితో బయటకు వెళ్లిన అతని తేజస్సు ఆ నిప్పులపై పడింది. అప్పుడు ఆ నిప్పుల నుండి అచ్చం వ్యాస మహర్షిని పోలిన రూపంతో ఒక బాలుడు జన్మించాడు. కానీ రంగుమాత్రం వ్యాసుడు కారు నలుపుతో ఉండగా శుకుడు మాత్రం తెల్లని తెలుపుతో ఉన్నాడు. శుకము అనగా చిలుక. చిలుకగా మారిన కృతాచి వలన ఆ బాలుడు జన్మించాడు కాబట్టి అతడికి శుకుడు అను పేరు వచ్చింది.
ఆ తరువాత శ్రీ శుకుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు. తరువాత శుకుడు కోరికలను పూర్తిగా వదిలి వేస్తాడు. శరీరానికి దుస్తులు కావాలన్న కోరికను కూడా వదిలి వేస్తాడు. దిగంబరంగానే తిరుగుతూ భగవంతుని ధ్యానంలో గడుపుతూ ఉంటాడు. ఆయన గురించి లోకం అంతా తెలిసిపోతుంది మహాజ్ఞాని, మహాయోగి అని. శుక మహర్షి ఎక్కడా కూడా ఆవు పాలు పితికినంత సమయం కూడా ఉండడు. అలాంటి ఆ మహర్షి ఏడు రోజులు ఒకే చోట కదలకుండా నిలిచివుండి పరీక్షిత్తుకి భాగవత కథను వినిపించి పరీక్షిత్తు మహారాజుకు ముక్తిని కలిగించాడు.
పరీక్షిత్తు ఎందుకు శుకమహర్షి చేత ఏడు రోజులు భాగవత పారాయణం చేయించుకున్నాడు. అసలు పరీక్షిత్తు ఎవరు ఆయన జన్మ రహస్యం ఏమిటో తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగుస్తుంది. చివరగా అశ్వథామ తన తండ్రిని చంపినందుకు, దుర్యోధనుడిని బీముడు అక్రమంగా తొడలపై కొట్టి చంపినందుకు పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అపాండవం చేస్తానంటూ దుర్యోధనుడి వద్ద ప్రతిజ్ఞ చేస్తాడు. తరువాత రాత్రివేళ పాండవులుగా భావించి ఉపపాండవులను చంపుతాడు. శిబిరాలను తగులబెడతాడు ఆ తరువాత అపాండవం అవునుగాక అని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రయోగించటమే కానీ ఉపసంహరించటం అశ్వథామకు తెలియదు. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువుకి కూడా తాకుతుంది. పాండవుల వంశాంకురం ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మాత్రమే. అటు తరువాత పాండవుల వంశం నిర్వంశం అవుతుంది. అప్పుడు ఆ శిశువుని కాపాడడానికి శ్రీకృష్ణుడు ఉత్తర వద్దకు వస్తాడు. ఆ తరువాత మాయను ప్రయోగించి శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో వున్న శిశువును బ్రహ్మాస్త్ర ప్రయోగం నుండి కాపాడతాడు. తరువాత ఉత్తర ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు విష్ణురాతుడు అని పేరు పెట్టారు. అలా జన్మించిన విష్ణురాతుడు దేనినైనా పరీక్షగా చుస్తూఉంటాడు గనుక శ్రీకృష్ణుడు పరీక్షిత్తు అని పేరు పెట్టాడు.
ఈ విధంగా శుకుడు మరియు పరిక్షిత్తు జన్మ రహస్యాలు భాగవతంలో వివరించబడ్డాయి.
Comments
Post a Comment